12.19.2010

ప్రియ నేస్తాల సుమమాల

ప్రపంచమే కాదన్నా, పైనున్నోడే రాకున్నా
నీతో ఉండే దైవం నేస్తంరా!
అద్రుష్టమే లేకున్నా నీకష్టమే తనదన్నా
నీలో ఉండే ప్రాణం నేస్తంరా!
పాపలా నువ్వున్నచో తను కన్నురా!
పాదమై నువ్వున్నచో తను మన్నురా!
వెలుగుల్లోనే కాదు చీకట్లో నీ నీడరా!
ఈ చొటనే కాదు స్వర్గాన నీ తోడురా!

బాగుంటుంది కదా ఈ పాట.. ఇదిగో ఈ పాట వింటుంటే నాకు వచ్చిన ఆలోచన నా ప్రియమైన స్నేహితులు ఎవరూ? చాలామంది జీవితంలోకి ఇలా వచ్చి అలా తొంగి చూసి వెళ్ళిన వాళ్ళే. చివరిదాకా నేస్తాలంటూ ఎవరున్నారు అని ఆలా ఆలోచన..

ఆ ఆలోచన రూపమే ఈ టపా. మొదట స్కూల్.. తరువాత కాలేజ్, ఆ తరువాత పెళ్ళి ఇదిగో ఇప్పుడు బ్లాగులు...ఈ సుదీర్ఘ ప్రయాణంలో నన్ను కలిసిన నా నేస్తాలు మరిప్పుడు ఎంతమందికి నేను గుర్తున్నానో అన్న ఆలోచన మనసున మెదులుతుంటే పాత తీపి జ్ఞాపకాలతో పాటు మదిలో మెదిలే మధుర భావనల స్నేహ సుమాలు ఒక్కొక్కటి ఇలా ఇక్కడ
... ప్రతి ఒక్క స్నేహ సుమం సువాసనల ఆఘ్రాణభరితమే.

స్కూల్: చాలా మందే ఉన్నారు, వీళ్ళు కూడా అందరూ పేర్లతో సహా గుర్తున్నవారే చిన్నప్పటి ఆటలు ,అలకలు, చిన్న చిన్న ఆటల తగాదాలు వెరసి బాల్య స్నేహం,. కాలేజ్ దాక కలిసి మెలిసిన నేస్తాలు పద్మశ్రీ, (పెళ్ళి దాక కూడా నాతో స్నేహం చేసిన స్నేహితురాలు) కల్పన, మార్త, పద్మజ. సుజాత, సరళ, సుధారాణి, సరస్వతి, ఉష, విజయలక్ష్మి, కళ్యాణి, చిట్టి రాణి ఇంకా ఇంకా..
వీళ్ళందరూ ఎక్కడున్నారో ఎవరన్నా ఇందులో బ్లాగులు పరిచయమున్నవారయితే మళ్ళీ ఒకసారి పాత అనుభవాలను నెమరేసుకుందాము.

కాలేజ్: కాలేజ్ ఇదో సీతకోక చిలుకల శాల, మధురమైన మరో ప్రపంచం. ఇక్కడ వసుధ చాలా కాలం అంటే నా పెళ్ళి కి కూడా వచ్చింది కాబట్టి మిగతావారితో పోల్చుకుంటే వసుధ ఎక్కువ కాలం స్నేహం అని చెప్పొచ్చు. ఇక మిగతావారు జ్యోతి, రూప, ఉమ, దీపిక, వేణి, పద్మ... కాలేజ్ లెక్చరర్స్ మమ్మల్ని "పొడుగమ్మాయి (నేనే) గ్రూప్" అంటూ పిలవడం అదో గొప్ప అనుభూతి.

నేను కంప్యూటర్ కోర్స్ చేసేప్పుడు పరిచయమయిన సుజన, వేణి, సాయి.. వీళ్ళల్లో సుజన కూడా పెళ్ళికి వచ్చింది అప్పట్లో నాకు ఉత్తరాలు కూడా రాసింది. ఉత్తరాలంటే గుర్తొచ్చింది ఇంకో స్నేహం నాకెవ్వరూ స్నేహితులు లేరు... నువ్వు ఎంత బాగా మాట్లాడుతావో అంటూ మా సీనియర్ రేణుక అని ఒక అమ్మాయి నాకు పరిచయమయి దాదాపు మొన్నీ మధ్య దాకాతన కుటుంబం గురించి తనెలా ఉంటున్నది తన జీవనశైలి అంతా చెప్పుకొచ్చేది. మళ్ళీ ఈ మధ్యనే కనుమరుగయ్యింది. ఇలా "నాకెవ్వరూ లేరు" అంటూ ఇంకో అమ్మాయి వనీల.... ఈ రేణుక వనీల ఒకే కోవకి చెందినవారు ఇద్దరికి పెళ్ళి అవలేదు మేము ఒంటరివాళ్ళం అనే భావన కలిగినప్పుడు నేను గుర్తొస్తాను .. నా దగ్గరికి వస్తారు. చెప్పేది ఓపిగ్గా వింటాను. నాకు తోచితే సలహా లేకపొతే మౌనం. రేణుక ఇక కలిసే ఛాన్స్ తక్కువ, ఎందుకంటే ఇప్పుడు ఏ ఊరు వెళ్ళిందొ మరి ఏమో కాని వనీల ఇక్కడే ఉంది కాబట్టి కలవచ్చు.

బ్లాగులు: పైన ఉన్నవి గొప్ప అనుభూతులయితే ఈ బ్లాగుల స్నేహం ఒక వింత అనుభూతి, కొంతమంది కేవలం ముఖ పరిచయాలు కొంతమంది బ్లాగు పరిచయాలు .. ఇంకొంతమంది బ్లాగు ద్వారా కలిగిన చాట్ పరిచయాలు, మరికొంతమంది ఇదిగో సరిగ్గా రెండు సంవత్సారల క్రితం నెక్లెస్ రోడ్ లో పుస్తక ప్రదర్శన శాలలో కలిసిన వారు. చాలామందే ఉన్నారు కాని అందరూ పరిచయం మాత్రమే. బ్లాగుల బంధం అంతవరకే. . అందరూ మంచి బ్లాగు నేస్తాలే.

ఇహ వీళ్ళందరూ కాక " నా " అనే ఈ జీవితంలోకి పూర్తిగా నా వ్యక్తిగత స్నేహం అంటూ చెప్పడానికి "మన ఆలోచనలు కాస్త అటు ఇటు గా ఉంటాయండి" అంటూ బస్ లో కలిసి వెళ్ళేప్పుడు పరిచయమయిన నేస్తం లక్ష్మి. (ఇప్పటికీ అప్పుడప్పుడు సరదాగా కలుస్తూ పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉంటాము ఎవరో ఒకరి ఇంట్లో) ఇలా బస్లో కలిసినవారు అందరు దాదాపు లక్ష్ములే... నాగ లక్ష్మి, శ్రీ లక్ష్మి.

ఇలా అందరూ ఆప్తులు ఉన్నారు ఆత్మీయులు ఉన్నారు.....వారి వారి జీవితాలను సాగిస్తూ సహోదర సమాన స్నేహం ఒకరు, మనసు మాట వినగలిగేది ఒకరు... ఇది చాలాదా..ఈ జీవితానికి, ఇంతకన్నా కావాలనుకోడం స్వార్థమవుతుంది. మనసులో మనం గుర్తుంటే చాలు అంతే.

అందరూ నా స్నేహితులు అంటున్నాను, మరి నేనెవరికి నేస్తాన్ని? అని ఆలోచిస్తే అది నా దగ్గర కన్నా అటు వైపు నేస్తం నుండి రావాలి నేనెవరికి? ఎలా? అన్నది. నాకు తెలిసి ఎన్ని సంవత్సరాల తరువాత కలిసినా, నా వయసు సహకరించి గుర్తు పట్టగలిగితే .. అదే గుర్తింపు, అదే చిరునవ్వు.... అలాగే వినడం, ఇందులో ఎందులోను మార్పు లేదు. చూద్దాము వీళ్ళల్లో నేను ఎంతమందికి గుర్తున్నానో...

డిసెంబర్ 22-24 మనం చదివిన స్కూల్‌లో క్రిస్ట్మస్ వేడుకలకి మన స్కూల్ బాల్య స్నేహితులకి శుభాకాంక్షలు.

డిసెంబర్ రెండో ఆదివారం బ్లాగర్స్ డే సంధర్భంగా బ్లాగర్లకి, బ్లాగు నేస్తాలకి శుభాకాంక్షలు.

16 నుండి 26 వరకు జరిగే ఈ-తెలుగు స్టాల్ విజయవంతమవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ - మీ (నేస్తం)?
*****
Loading...