11.20.2010

అనుకోకుండా ఒక రోజు....(మళ్ళీ ఈరోజు)

పుడమి తల్లి పులకరించింది... ఆకాశం దద్దరిల్లింది.. మేఘాలు వర్షించాయి.... ప్చ్.. ఇంకా తెలియలేదా అక్కా.. ఇన్ని ప్రత్యక్ష సాక్ష్యాలు చెపుతున్నా అర్ధం కాలేదా... ఇన్ని సంఘటనలకు దారి తీసిన ఆ రోజు ఆ ఒక్క రోజు ఇంక చెప్పుకోలేకపొతున్నావంటే॥ నీకసలు నామీద ప్రేమ.. అప్యాయత అనురాగాలు అసలున్నాయా??
తమ్ముడు తన ప్రతి పుట్టినరోజుని నాకు గుర్తు చేసే ప్రయత్నంలో జరిగే ఉప్పొద్ఘాతమది.. భలే సరదాగా అంటాడు॥ ఇవన్నీ వినడం కోసమన్నా.. మర్చిపోయినట్లు నటిస్తాను ఒక్కోసారి..
చిన్నప్పుడు... ఒక రోజు మిట్ట మధ్యాహ్నం వేళ .. మా అక్క వాళ్ళ స్కూల్ లో మా ఇంటి పక్కన నలుగురమ్మాయిలు... అర్జంటుగా ఆత్మహత్య చేసేసుకొందామనుకొన్నారట .. ఏమయ్యింది అని అడిగితే....యునిట్ టెస్ట్ సరిగ్గా రాయలేదని.. అక్క పరుగు పరుగున ఇంటికివచ్చి... వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఉమ, ప్రసన్న, విజ్జి, మాధవి వీళ్ళంతా అక్కడ బావిలో దూకేస్తామంటున్నారు నన్ను వెళ్ళి చెప్ప మన్నారు అంది వగరుస్తూ... వాళ్ళ ఆమ్మలందరు.. నింపాదిగా అప్పడాలొత్తుకొంటూవున్నారు..వార్త విన్న తరువాత కూడా. ఆ తరువాత కొద్దిసేపటికి.. " అలాగా!!.. నువ్వు భోజనం చేసి వెళ్ళేప్పుడు.. మా ఉమ కి చెప్పు రేపు దాని పుట్టినరోజని .... అందిట సదరు ఉమ వాళ్ళ అమ్మ.. అక్క ఈ వార్త అక్కడ చేరవేయగానే.... ఆ ఆత్మహత్యాప్రయత్నాన్ని.. కాన్సిల్ చేసుకొందట ఆ ఉమ ఆమెతో పాటు మిగతావారు ఆమె బాటే.. పట్టారు.. పుట్టినరోజా???.. మజాక...
ఇలా ఎన్నో సరదా సరదా సంఘటనలు చోటు చేసుకొన్న ఈ పుట్టిన రోజుల సంబరాలంటే... ఎవరికి మటుకు ఇష్టం వుండదు చెప్పండి.. అందుకే తమ్ముడికి (గుర్తు చేయాలి) చెప్పాలి..
సరిగ్గా కొన్నేళ్ళ కిందట..నవంబర్ 20 న పుడమి తల్లి పులకరించింది.... ఆకాశం దద్దరిల్లింది... మేఘాలు వర్షించాయి... అని తమ్ముడికి చెప్దామనుకొంటున్నాను వాడి ఫందాలోనే... చాన్స్ ఇవ్వడు॥ రాత్రి కేక్ తో ప్రత్యక్షమవుతాడు... హ్యాపి బర్త్ డే అక్కా!! అంటూ... చూడాలి...
ప్రతి మనిషి.. తన జన్మకి పరమార్ధం తెలుసుకొని......
నా జన్మకి పరమార్ధం ఇంక తెలియకపొవడమే.. విశేషం.. అందుకే ఆ పరమార్ధం ఎప్పటికైనా తెలుసుకొవాలనే ఆకాంక్షతో మళ్ళీ మళ్ళీ రావాలి ఈరోజు అని .... అనుకొంటూ వుంటాను..

11.08.2010

ఉనికి కోల్పోయిన (ఉత్తరం ముక్క) ఉత్తరాల రాయుడు(POST MAN)

"లేఖలు అందించే చినవాడ ప్రేమలేఖలు రాసావా ఎపుడైనా??"

ఓ ప్రేయసి.. తన ప్రియుడి కోసం పాడుకొన్న పాట అది... ఒక్క ఆ ప్రేయసికేనా ఈ లేఖలు అందించే చినవాడు.. అందరికి ప్రియమైన అపరిచితుడే... మధ్యాహ్నం ఒంటిగంట నుండి మొదలు...(మా ఊర్లో మధ్యాహ్నమే ఉత్తరాల బట్వాడ ఉండేది).... ఎప్పుడెప్పుడు వస్తాడా ఈ చినవాడు॥ ఏమేమి కబుర్లు మోసుకొస్తాడో.... అన్న ఆతృత.. రాగానే ఆనందం..

తెచ్చేది ఏ వార్త అయినా.. తనకేమి పట్టనట్లుగా వుండగలిగేది కూడా ఒక్క ఈ పోస్ట్ మాన్ మాత్రమే.. ఇప్పుడు ఈ సాంకేతిక పరిజ్ఞానం పెరగడంవల్ల... అందరూ.. మొగ్గు చూపేది... సెల్ ఫొన్ సంభాషణలు.. లేదా చాటింగ్ ముచ్చట్లు.. ఎవరికి ఉత్తరం విలువ అసలు తెలీదు.. సాహిత్యం కనుమరుగవుతోంది. ఎవరిని తరచి చూసినా.. e-mails... sms ...అసలు ఉత్తరం ఎలా రాయలో కూడ తెలియని వాళ్ళున్నారు.. "ఉభయకుశలోపరి" అంటే ఏంటి అని అడుగుతారు..అప్పట్లో మేము (నేను మా అక్క) పోటీలు పెట్టుకొనే వాళ్ళము.. ఎవరెక్కువ ఉత్తరాలు రాస్తారో చూద్దామా అని... "వెళ్ళగానే క్షేమంగా చేరినట్లు ఉత్తరం రాయమ్మా " అనేవారు అప్పట్లో... ఇప్పుడు ... ఫొన్ చెయ్యి.. లేదా ఓ మిస్డ్ కాల్ ఇవ్వు...
ఇలా కట్టె , కొట్టే , తెచ్చే... లా వుండే ఈ సెల్ సమాచారాలు.. మిస్డ్ కాల్స్.. వల్ల భాషలకి.. భావాలకి.. మంచి భావనలకి...ఆఖరికి బంధుత్వాలకి దూరమై పొతున్నారు అంటే అతిశయోక్తి కాదేమో.. అప్పట్లో ఉత్తరాల ద్వారా తమ సాహిత్యాభిలాషను చాటుకొనే వారు.. సాంకేతికంగా మార్పు మంచిదే... కాని మానవ సంబంధాలు ప్రశ్నగా మారేంతగా కాదు.. ఎక్కడో విదేశాలలో వున్నవాళ్ళకి ఎలాగు తప్పదు.. ఫొటోలు .. విడియోలు పంపించి.. తమ క్షేమ సమాచారలు తెలుపుకొవడం.. ఇక్కడే వున్నవాళ్ళు తప్పనిసరిగా అప్పుడప్పుడు కలుస్తూ .. ఉత్తరాల ద్వారా క్షేమ సమాచారలు తెలుపుకొన్నట్లయితే పిల్లలికి మనము బంధుత్వం గురించి వాటి విశిష్టత గురించి నేర్పిన వాళ్ళమవుతాము..... మొన్న మా కజిన్ వాళ్ళ బాబుకి... నన్ను పరిచయం చెయ్యడం.. "అత్త" నాన్న... మా పెళ్ళి విడియోలో లెఫ్ట్ నుండి.. 2nd ఫొటొ.. నీకు చెప్పానుగా....ఇలా వున్నాయి ఇప్పటి పరిచయాలు.. ఉండేది ఒకే ఊర్లో మళ్ళీ.. కలవడం తక్కువ... పరిచయాలు అంతకన్నా తక్కువ.. ఇలా అయితే పిల్లలికి ఎలా??
మొన్నామధ్య.. ఈ శ్రీజ .. శిరీష్ ల పెళ్ళిగురించి ఏదో విషయంలో ఒక పెద్దాయనని ఇంటర్వ్యూ చేసిందో ప్రైవేట్ ఛానెల్ ఆయన అన్న మాటలు నాకు చాలా నచ్చాయి.."ఇప్పటి యువత.... సినిమా మోజు లో పడిపోయింది.. మంచి సాహిత్యం చదవరు... విలువలు తెలీవు ... ఆవేశం... ఆతృత...ఆకర్షణల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు... ఆలోచన తక్కువ... మంచి పుస్తకాలు చదివి వాటిని ఉత్తరాల ద్వార ఒకరికొకరు తెలియజేసుకొంటే ఆలోచన పరిజ్ఞానం పెరుగుతుంది అని నా అభిప్రాయం.. "
అంతే కదా మరి... చక్కటి సాహిత్య విలువలు కల పుస్తకాలు మన ఆత్మ వికాసానికి .. సోపానాలు..అలాగే భావపూరితమైన లేఖలు కూడా అంతే స్థానాన్ని పొందుతాయి..

11.03.2010

పుత్తడి బొమ్మకి పుస్తెలు కడుతూ...

పురుషుడి ముని వేళ్ళు పచ్చని మెడపై రాసే వెచ్చని చిలిపి రహస్యాలు .
ఎంత చక్కటి భావన. స్పర్శ గురించి సున్నితమైన అర్ధం అంతర్లీనంగా దాగి వుంది ఇందులో. స్త్రీ - పురుషుల మధ్య వుండే సంభంధాన్ని ఎంతో సున్నితంగా వివరించారో గేయ రచయిత, పైన వాక్యంలో.
చలం పుస్తక ప్రభావం అయితేనేమి, ఇంకేమన్నా కానివ్వండి,ఉసిగొల్పి.. ఉసిగొల్పి ఈ వ్యాసం రాసేలా చేస్తోంది, ఈనాడులోని ఆదివారం కధ "స్లీపింగ్ పీల్". ఈరోజు నేనిలా రాసే వ్యాసం ఎవరినన్నా నొప్పిస్తే క్షమించేసి చదవడానికుపయుక్తులు కండి.
ముందుగా కధలో తరతరాల్నించి, పురుషుడు , స్త్రీ పై, స్త్రీ ప్రమేయం లేకుండా తన ఆధిక్యత ఎలా నిలబెట్టుకొంటాడో, చెప్పడం అక్కడ ముఖ్య ఉద్దేశం గా వివరించడం జరిగింది. అయితే ఇదే ఈనాడులో, ఓ నెల క్రితం అనుకొంటా! వీరిద్దరి మధ్య సంబంధం గురించి సర్వెలో ఇప్పటి నవజంటలు వెల్లడించిన విషయాలు, అసలు సంసారం చెయడానికి టైం లేదనడం. ప్రస్తుత ఈ ఉరకల పరుగుల జీవితంలో కాస్త సాంకేతిక పరిజ్ఞానం ఉన్న యువత (కొత్త జంటలు) ఎక్కువగా వారి వారి అభివృద్ది కోసం పడే తపన వల్ల అసలు మాములుగా మాట్లడే తీరిక కూడా లేదని ఆ పరిశోధనలో వెల్లడైందని చెప్పడం జరిగింది .
మరి ఇప్పటి తరం ఇలా వున్నప్పుడు ఈ కధ యువతకి ఎంతవరకు ఒక సందేశం ఇవ్వగలదు పైగా లేని అపార్ధాలు , అర్ధం తెలియక అపోహ పడడం జరిగే అవకాశం కలిగించేదిగా వుందీ కధ. తనే కాకుండా ఎక్కడో అమెరికాలో వున్న తనకూతురు కళ్ళ నీళ్ళు వత్తుకొంటొందా లేదా?? లేక చిన్నప్పుడు తన అత్త, తన తల్లి కళ్ళ నీళ్ళు ఎందుకు వత్తుకొన్నారో? అర్ధం , అప్పుడు తెలియకపోవడం అదేదో ఇప్పుడు తెలిసినట్లుగా, స్త్రీలందరికి ఈ విషయంలో చాల అన్యాయం జరిగిపోతోంది అని అనడం అంత సమంజసంగా లేదనిపిస్తోంది. ఇదంతా స్త్రీకి లేని అసహయతని చూపించినట్లుగా వుంది. ఇప్పటి స్త్రీ పురుషులు అంతటి అజ్ఞానం లో లేరు, ఒకరి అభిప్రాయాలు ఒకరు అర్ధం చేసుకొంటున్నారు. ఇదే కధని పెళ్ళి కాని వాళ్ళు చదివితే వాళ్ళకి లేని భయం సృష్టిస్తున్నట్లుగా వుందీ కధ.
కళ్ళతో మాట్లాడుకోడం, మనసు మనసు ముడిపడడం , మాములుగా ఒకరితో ఒకరు మాట్లాడుకొడం ఇవన్నీ ఇచ్చే తృప్తి కాన్నా వెయ్యి రెట్లు ఆనందం తృప్తినిచ్చేది స్పర్శ.. అది ఏ ఇద్దరి మధ్య అయినాకావచ్చు. పసిపిల్లలు ఉయ్యాలలో ఏడుస్తున్నప్పుడు, దూరం నుంచి ఎంత ఊరడించినా తాత్కాలికంగా ఊరుకొన్నా ఎవరన్నా వచ్చి ఎత్తుకొంటే వెంటనే ఆపేస్తారు. అంత గొప్పది స్పర్శ . రోజుల వయసునుండి స్పర్శ కి అలవాటు పడిన మానవ జన్మ మనది, అత్త వడి పువ్వు వలే మెత్తనమ్మా.. అని ఒక్కో స్పర్శ గురించి ఒక్కోవిధంగా వివరించారు. మరి అలా అన్ని స్పర్శలని అంత ఆనందంగా అనుభవించగలిగినప్పుడు స్త్రీ పురుషుల మధ్య వుండే సంభాందాన్ని మటుకు ఎందుకలా లేని పోని అపార్ధాలవైపు తీసుకెళ్తారో, కొంతమంది.
ఎయిడ్స్ గురించి చర్చించుకోండి, జాగ్రత్త గా ఉండండి అని ప్రచారం చేసేవారు, అసలు సృష్టికార్యం (సక్రమమైన ) ఎంత గొప్పదో , మాతృత్వం ఎంత మధురమో కూడా ప్రచారం (కళ్ళ నీళ్ళు వత్తుకొని కాదు) చెయ్యాలని నా ఉద్దేశ్యం, లేదా పెద్దవారు చెప్పగలిగితే తమ పిల్లలికి(ఇప్పటి పిల్లలు అర్ధం చేసుకొనే వారే) సున్నితంగా వారికి అర్ధం అయ్యే రీతిలో చెప్పాలి. వారి అభిప్రాయలని నిక్కచ్చిగా చెప్పగలిగే దైర్యం కూడా ఉండేలా చేయగలగాలి. కాని ఇలాంటి కధలని అధారంగా చేసుకొని లేని పోని భయాలని సృష్టించకూడదు.
ఇదే కధ ఎవరో బ్లాగరు కూడ తన బ్లాగులో లింక్ ఇచ్చారు చదవని వారు చదవడానికి వీలుగా(ష్.. నాకు లింక్ ఎలా ఇవ్వాలో తెలీదు సారి !!అందుకే...ఇలా..)

11.02.2010

తెలుగు వెలుగుల(తో)లో ..... దీపావళి


బ్లాగు మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు.


నాలుగు రోజుల క్రితం, ఒకసారి ఎందుకో నాకు ఇష్టమైన వాళ్ళతో ఓ అరగంట మాట్లడాలి అన్న ఆలోచన మదిలో పదే పదే కదలాడింది. ఆలోచించాను, నాకిష్టమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాని అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు తలమునకలై నాతో అరగంట గడపలేని వాళ్ళే.

ప్రతి మనిషికి ఎప్పుడో అప్పుడు ఈ ఆలోచన అనేది వస్తుందని నా అభిప్రాయం. అంతెందుకు నాకు కలిగినట్లుగానే నా స్నేహితులకి ఇలాంటి ఆలోచన కలిగినప్పుడు , నేను వాళ్ళతో ఓ అరగంట గడపగలనా? నన్ను ఇష్టపడ్డవాళ్ళు , నాకిష్టమైన వాళ్ళు అందరూ బాధ్యతల బంగారు సంకెళ్ళతో ఉన్నవాళ్ళే. తీరా మాట్లాడే సమయం చిక్కినప్పుడు, మనసు మూగబోతుంది.

"లేనిదికోరేవు, ఉన్నది వదిలేవు
ఒక పొరపాటుకు యుగములు వగిచేవు "
అన్న పాట గుర్తోస్తోంది.

నా మనసు చెప్పినట్లుగా, నాకు నచ్చినట్లుగా, ఒక్క అరగంటే కాదు, కావాలనుకుంటే ఎన్ని గంటలైనా నాతో ఉండే నా ప్రియ నేస్తం నా బ్లాగు నాకు తోడుండగా, లేని దాని గురించి పాకులాడడం ఏమిటి? అని నిన్న పండగ హడావిడి తగ్గినతరువాత , నా బ్లాగు మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు చెప్దామని తెర తీసి ఓరగా కూడలి వైపు చూడగా, "తెలుగు వెలుగులు" అంటూ శ్రీధర్ గారి బ్లాగులో నా బ్లాగు పేరు కనపడింది.


అంతే!! ఒక్కసారిగా ఉలిక్కిపడ్డా! అదేంటి నన్నొదిలేసి నా బ్లాగు అక్కడేమి చేస్తోంది? అని చూద్దును కదా! నోట మాట రాలేదు నిజంగానే. మనసు మూగబోయింది. దీనికంతటికి(నా బ్లాగు శ్రీధర్ గారి బ్లాగుతో స్నేహం చెయ్యడానికి) కారణం జ్యోతిగారని తెలిసింది. ఇలా కూడా జరగొచ్చని, జరుగుతుందని తెలిపిన జ్యోతిగారికి, సహకరించిన శ్రీధర్ గారికి కృతజ్ఞతలతో, దీపావళి శుభాకాంక్షలతో...


"ఏమి జరిగింది?" అని అలా మెల్లగా అడుగుతారేంటండీ?? ఆనందంతో చెప్పడానికి.. "గుండె గొంతుకలోన కొట్టాడుతుంది, ప్చ్! ఎంత ప్రయత్నించినా , గొంతు దాటి అది రానంటోంది. ( పైన ఉన్న చిత్రం క్లిక్ చేసినా చాలు)" అందుకే మీరే శ్రమ అనుకోకుండా ఒక్కసారి అటెళ్ళి రండి.

11.01.2010

కలలో తీసుకున్న వస్తువు కలలోనే తిరిగి ఎలా ఇవ్వడం? (ఒక తమాషా సంఘటన)

తమ్ముడి రెండో కొడుకు..సన్నీ మొన్న ఆగష్టుకి మూడేళ్ళు.... చాలా అల్లరి పిల్లాడు...  అని తెలుసు కాని, ఇలా ఎటూ ఏమి చెయ్యలేని పనులు అప్పజెప్పేంత అల్లరి పిల్లాడనుకోలేదు. ఎంత సరదాగా అడిగాడు మా బాబుని.. "నాకు కల్లోనే కావాలి"  అని .. మొదట్లో విషయం ఇదీ వదినా .... అంటే మాములుగా తీసుకున్నాను. కాని వాడు "నాకు కలలోనే కావాలి " అని ఏడుస్తుంటే భలే సరదా వేసింది. అసలు విషయం ఏంటంటే......

 మా బాబుకి మా సన్నీ కి అసలు పడదు పనిగట్టుకుని ఏడిపిస్తాడు మా బాబు ,... మళ్ళీ ఇద్దరు కలిసి అంత సఖ్యంగాను ఉంటారు. "వీళ్ళిద్దరికి క్షణం పడదు క్షణం వదిలి ఉండలేరొదినా"  అంటుంది మా మరదలు. 

మొన్న శుక్రవారం వెళ్ళాను పిల్లలిని చూద్దామని మా అమ్మవాళ్ళింటికి.. కుశల సమాచారాలు అయ్యాక.. "వీడేమి చేసాడో తెలుసా వదినా!"  ఈరోజు అని మరదలు చెప్పడం మొదలెట్టింది. ఎదో అల్లరి పనే అయి ఉంటుందని విన్నాను. "నిన్న పొద్దున్న వంట చేస్తున్నా....  చంక దిగడు... పాలిస్తానంటే ససేమిరా అంటాడు (వాడెంత ఏడ్చినా పాలా మాట ఎత్తితే ఠక్కున ఏడుపు ఆపేస్తాడు) ఎత్తుకునే వంట చేయాల్సి వచ్చింది. అక్కడికి చింటూ (మా బాబు) చాక్లేట్ కూడా తీసుకొచ్చాడు ఉహు..! అది కూడా వద్దని విసిరి కొట్టాడు.. ఏడుపు ఆపడానికి ఎంత మభ్యపెట్టాల్సి వచ్చిందో .."   ఇంతకీ ఏడుపు ఎందుకంటే.. "చింటూ కలలో నా చాక్లెట్ తీసుకున్నాడూ..." అనిట.. వాళ్ళిద్దరి రోజువారి పోట్లాట ఎదో కలగని ఉంటాడు. సరే ... అని మా బాబు అప్పటికప్పుడు చాక్లెట్ కొని ఇస్తే ... "నాకొద్దు కలలోనే కావాలి"  అని... దాదాపు రోజంతా  ఏడుపు... :)

ఫన్నీగా ఉంది కదా... ముందు మాములుగా విన్నా...  ఎందుకో వాడు కలలోనే కావాలి... అంటే అవునూ ఎలా? అని అలోచన వచ్చింది సరదాగా ఇలా మీతో పంచుకున్నా.. :) 
*******


ఏకాంత సేవ - ఏ ' కాంత ' సేవ?

అప్పుడెప్పుడెప్పుడో, అంటే మొన్నీమధ్యే నాకు పెళ్ళి కాకముందు , అంటే నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో, ఎదో రాజకీయ గొడవల వల్ల , ఆ విద్యా సంవత్సరం సాగదని అంటే ఖాళీ గా కూర్చోవడం ఎందుకని , మన అప్పటి ముఖ్యమంత్రి యన్.టి ఆర్. గారి దగ్గిర ఉద్యోగంలో చేరాము నేను మా ఫ్రండ్. ఆరు నెలలు చాలా సరదాగా గడిచిపొయాయి. 15 మంది అమ్మాయిలం, ఇంకో 5, 10 మంది దాకా అబ్బాయిలు. అమ్మాయిల్లో ఒక అమ్మాయికి మాత్రమే పెళ్ళి అయ్యింది. మిగతా అందరము చదువుకొంటూ, ఏదో అనివార్య కారణాల వల్ల ఇలా ఉద్యోగం చేస్తున్నవాళ్ళమే. సాయంత్రం వర్క్ అయిపోగానే , ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళడానికి చాలా తొందర పడేది. మాకు కేటాయించిన వ్యాన్ రెండో ట్రిప్ లో మేము వెళ్ళేవాళ్ళము. ఆమె అంతవరకు కూడా ఆగకుండా బస్ ని ఆశ్రయించేది. "ఏమిచేస్తారు ఇంటికెళ్ళి "? అని అడిగితే, అప్పుడంది కదా ఆమె, “మీకెమి తెలుస్తాయి మా బాధలు? రేపొద్దున్న పెళ్ళి అయ్యక తెలుస్తాయి ఏకాంత సేవమ్మా… ఏకాంత సేవ చెయకపోతే ఏ ‘కాంత’ నో చూసుకొంటారు “ అని.
****
మళ్ళీ ఇంతకాలం తరువాత ఆ మాటలు నాకు గుర్తోచ్చాయి. పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టేసారు కాని, ఈ ఏకాంత సేవ చేసుకొనే అవకాశం ఇంతవరకు రాలేదు నాకు.

ఇప్పుడైనా ఎందుకు గుర్తొచ్చిందంటే, మావారి కల నేను నిజం చేయలేదు అని, ఆయనకి నామీద కాస్త కోపం వచ్చి, ఆ టైం లో ఆయన అన్న మాటలు , ఇలా నా చెవిలో అలా మారి మ్రోగిపోతూ వుంటే, నా కళ్ళ నుండి రెండు అశ్రు బిందువులు, పుడమి పై రాలుతూ వుండగా.... అమ్మో! ఎంత భారి డైలాగ్, అసలు ఈ సినిమావాళ్ళు ఎలా చెప్తారో అంత భారి, భారి డైలాగ్స్, వుండండి! కొంచం మంచి నీళ్ళు తాగి వస్తాను. హమ్మయ్య! ఎక్కడున్నాము మనము? అశ్రు బిందువులు కదా..

అసలింతకీ మా వారి కల ఎంటంటే:

Operation  థియేటర్:
ముందు రెడ్ లైట్ వెలుగుతూ వుంటుంది. లోపల నేను , బయట మావారు నుదిటిన లేని చెమటని టెన్షన్ గా కర్చీఫ్ తో తుడుచుకొంటూ , చేతులు నలుపుకొంటూ  లేదా చేతులు వెనక్కి పెట్టుకొని అటూ, ఇటూ నడుస్తూ, మిగతా బంధువర్గమంతా బయట కూర్చుని తదేకంగా రెడ్ లైట్ ని చూస్తూ వుంటే, ఇంతలో .. కెవ్వున వినిపిస్తుంది అది నా “కేక”. రెడ్ లైట్ ఆరిపోతుందన్నమాట. ఒక్కసారి అందరూ (మావారితో సహా ) అలర్ట్ గా తలుపువంక చూస్తూ ఉంటారు. ఇంతలో తెల్లటి డ్రెస్స్ లో నర్స్ మావారి దగ్గరికి వచ్చి, "కంగ్రాట్స్! మీకు పాప పుట్టింది” అని చెప్తుంది. మళ్ళి కెవ్వున కేక .. ఈసారి నాదగ్గరినుండి కాదు, మావారి దగ్గరనుండి. ఇదీ మావారి కల.

పాపం! అప్పుడూ నెరవేరలేదు మరి బాబు పుట్టినప్పుడు నేరవేరలేదు. ఏమిటో ఇలా వెళ్ళి అలా ఇంటికి వచ్చెసాను. డాక్టర్ తో కూడా అదే చెప్పాను, " ఇలా అయితే వందమందిని కనేయచ్చు కదా " అని. తననుకున్నట్లు జరిగివుంటే చక్కగా "ఎత్తుకొని గిర గిరా తిప్పేవాణ్ణి" అన్నారు మావారు. అదిగో!! అప్పుడు అంకురించింది నాలో , సన్నటి అనుమానపు పొర. నన్ను ఎత్తుకొనే ఛాన్స్ లేదు, నేను కరణం మల్లీశ్వరిని కాబట్టి. రోజుల పిల్లలిని అసలు ఎత్తుకోరు..మరి? అంటే...... ఆ నర్స్ నే కదా.......  అమ్మో!....  ఎంత గండం గడిచిపోయింది అసలు నేను ఏకాంత సేవ చేయకపోవడం వల్లే కదా! ఈయనకి ఇలా ఏ 'కాంత' సేవో చేసేద్దామన్న ఆలోచనలు..

అప్పటినుండి అవకాశం గురించి ఎదురుచూస్తున్నాను.

ఇదిగో ఈరోజే ఆ అవకాశం వచ్చింది ఇప్పుడు చూపిస్తా , నా “ఏకాంత సేవ తడఖా ఎంటో! ఏ 'కాంత' ఊసెత్తరిక” అని మనసులో అనుకొన్నాను.

ఆదివారం పొద్దున్న, సుబ్బరంగా అరడజన్ పెసరట్లు , ఉప్మాలో నంజుకొని ఆవురావురుమని తినేసి, ఇంకా అవి పూర్తిగా అరగకముందే , “ఈరోజు వంట ఏమిటోయి?” అని , గుత్తొంకాయకూర, పట్నం పచ్చడి(దీనిగురించి తరువాత చెప్తాను ఇది చాల వెరైటీ పచ్చడి) మామిడికాయ పప్పుతో షుస్టుగా భోజనం చేసి , "ఆదివారం వంటలు అమోఘం" అంటూ అనంద పడిన నా పతిదేవుడు, సాయంత్రం అయ్యేసరికి పాపం! కడుపులో వున్న పెసరట్టుకి, మిగతా వాటికి.. పొంతన కుదరక పోట్లాడుకొంటుంటే , తట్టుకోలేక “ఒంట్లో ఏదో నలతగా వుంది” కాసేపు పడుకొంటాను అన్నారు. 

"అబ్బ! ఎన్నాళ్ళకి దొరికారు, నాకు ఏకాంత సేవ చేసుకొనే మహత్తరమైన అవకాశం వచ్చింది " అని మహదానంద పడిపోయి , ఎగిరి గంతేద్దామనుకొని , ఆ ప్రయత్నం విరమించుకొన్నాను...  శనివారమే మావాడన్న మాటలు గుర్తొచ్చి. నేను ఇంటి మొదటి మెట్టు ఎక్కగానే నేను వస్తున్నాని పసిగట్టేసి, పరిగెత్తుకొంటూ వచ్చి “అమ్మా” అంటూ చుట్టుకుపోతాడు వాడు. " వేలెడు లేడు వెధవ ఎంత సూక్ష్మ గ్రాహి" అని మురిసిపోతుంటాను నేను. ఆ మురిపం తీరకముందే వాడన్నాడు కదా. “అమ్మా నువ్వు వస్తున్నావని ఎలా గుర్తు పడ్తానో తెలుసా? నేను, " మొదటి మెట్టు ఎక్కగానే మన బిల్డింగ్ ఒక్కసారిగా షేక్ ఇస్తుందమ్మా , నువ్వొచ్చావని పరిగెత్తుకొంటూ నీ దగ్గరికి వస్తాను “ అన్నాడు.

అదన్నమాట అందుకే ఎగిరి గంతేద్దామన్న సాహసాన్ని విరమించేసుకొన్నాను.

అలా మావారికి ఏకాంత సేవ చెద్దామని, మావారు పడుకొన్న మంచం పక్కన చిన్న టీపాయి వుంచి, దాని మీద ఇంట్లో వున్న బి - కాంప్లెక్స్ టాబ్లెట్స్, బలానికి టానిక్, ఒక జగ్ నిండా నీళ్ళు , ఓ పెద్ద గాజు గ్లాసు, ఇంకా.. ఆ! ఓ చిన్న పింగాణి బేసిన్ లో వేడి నీళ్ళు, ఒక తెల్లటి క్లాత్ అక్కడ సిద్దంగా పెట్టుకొని(మధ్య మధ్యలో నుదిటి మీద క్లాత్ తో అద్దాలిగా మరి, చాల సినిమాల్లో చూసానన్నమాట) , ఆ పక్కన ఓ మిక్సీ , జార్ కొన్ని ఆరెంజస్, మావారికి మధ్యలో, మధ్యలో జ్యుస్ తీయడానికి అనువుగా అన్నీ సమకూర్చుకొని, ("నైట్ అయి వుంటే ఇంకా బాగుండేది కదా" అని మనసులో అనుకొని ) పక్కన పడక కుర్చీలో కూర్చుని/పడుకొని, అలా ఆయిన వైపు దీనంగా చూస్తుంటే ..నాకు నిద్ర పట్టేయాలి , మధ్యలో ఉలిక్కిపడి లేచి, టైం చూసుకొని , మందులిచ్చే టైం అయిందని తనని లేపి , జాగ్రత్తగా వళ్ళో పడుకోబెట్టుకొని ఓ టాబ్లెట్ వేయాలి. తను కూడా మద్యలో ఒకసారి లేచి నావైపు చూసి “పాపం నా గురించి ఎంత కష్టపడుతోందో .."(చేసుకొంటే ఇలాంటి అమ్మాయినే ..ఓహ్!సారి మాకు పెళ్ళి అయిపోయింది కదా మర్చిపోయాను) అని నా ఏకాంత సేవని గుర్తించాలి. నాకెందుకో రాజశేఖర్ – జీవిత, యన్.టి ఆర్- లక్ష్మి పార్వతి, ఇంకా చాలా మంది సినిమా బార్యా, భర్తలు గుర్తొచ్చారు, వీళ్ళందరూ ఇలాగే కదా, ఏకాంత సేవ చేసి మెప్పు పొందారు. గెటప్ కూడ మార్చేసాను, అప్పుడప్పుడు కళ్ళ నీళ్ళు తుడుచుకొడానికి అనువుగా చీర కొంగు అవసరంవుతుందని. ఇలా అన్నీ సమకూర్చుకొని, ఆయనవైపు ఒకసారి దీనంగా చూసి పడక కుర్చీలో అలా చేరగిలపడ్డాను.

కల: నేను చేసిన ఏకాంత సేవకి మెచ్చుకొని ఎంతో మంది హీరోలు, " నేనంటే నేను " అని పోటీ గా వాళ్ళ జేబులో వున్న తాళి బొట్లు తీసి నా దగ్గరికి వస్తున్నట్లుగా(వాళ్ళెప్పుడు అంతే ! జేబులో అలా మంగళ సూత్రం పెట్టుకొని వుంటారు రేడీ గా) ..

ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాను, "బహుశా మావారికి టాబ్లేట్ వేసే టైం అయి వుంటుంది అందుకే మెలుకువ వచ్చింది" అని అనుకొని , నా సమయస్ఫూర్తికి నన్ను నేనే మెచ్చుకొని, మంచం వైపు చూద్దును కదా ఈయన లేరు. ఎక్కడికెళ్ళి వుంటారబ్బా, అసలే ఒంట్లో బాగోలేదన్నారని ఇల్లంతా కలియ తిరిగి, ఇక లాభం లేదనుకొని సెల్ కి ఫోన్ చేసాను. అటు వైపు నుండి జవాబు. “ ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే పక్కింట్లో వున్నాను” అని “ పక్కింట్లోనా? అక్కడ ఏమి చేస్తున్నారు? మీకు వంట్లో బాగోలేదు కదా! నేను... ఏకాంత సేవా… " అంటూ నసుగుతూ ఉంటే... (నాకెందుకో ఏ కాంతో గుర్తొచ్చింది) “ఏంటి ఏ 'కాంత' ?” అంటూ తనూ సాగదీసారు..”హు !హు! ఏ 'కాంత' కాదు ఏకాంత అంటూ .. అసలు ఈయనతో మాటలెందుకని నేనే ఆయన చెప్పిన పక్కింటికి వెళ్ళి చూద్దునుకదా, ఆయన పక్కింటాయనతో కార్డ్స్ ఆడుతూ కనిపించారు , పక్కింటావిడ పెట్టిన పకోడి పర పరా నములుతూ.. అప్పుడనుకొన్నా! కసిగా “మళ్ళీ దొరక్కపోరు నాకు ఏకాంత సేవ కోసం “అని :( :(


Loading...